03/11/2018
ప్రశ్న: ఆధునిక విజ్ఞానం అనే మాయలో పడి మనం మన సంస్కృతిని కోల్పోవడం, కాలుష్యాన్ని పెంచడం ఎంతవరకు న్యాయం?
- బి.ఆనంద్
జవాబు :ఆధునిక విజ్ఞానం ఓ మాయ కాదు. అది ప్రపంచ వ్యాప్తంగా శ్రామికులు, మేధావులు, ప్రజా సమూహం సమిష్టిగా సాధించుకున్న అద్భుత విజ్ఞాన భాండాగారం. ఆధునిక విజ్ఞానం లేనిదే ఈరోజు ఈ సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, విజ్ఞాన విషయాల పరంపర, నివాస వ్యవస్థ, విద్యావ్యవస్థ, ఆహార సంపద ఉండేవి కావు. నేడు ప్రపంచ వ్యాప్తంగా మానవుడి సగటు ఆయుర్ధాయం సుమారు 70 సంవత్సరాలు. భారతదేశపు సగటు ఆయుర్ధాయం సుమారు 65 సంవత్సరాలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చేనాటికి (సుమారు 70 సంవత్సరాల క్రితం) భారతదేశ సగటు ఆయుర్ధాయం 40 సంవత్సరాలు. 1900లో ప్రపంచ సగటు ఆయుర్ధాయం 33 సంవత్సరాలు కాగా, అది భారతదేశంలో 25 సంవత్సరాలుగా ఉండేది. ఎన్నో వ్యాధుల బారిన పడి, వాతావరణ ప్రమాదాలు, ప్రక తి వైపరీత్యాల పాలనబడి మనుషులు చిరు ప్రాయంలోనే చనిపోయేవారు. అద్భుత ఆరోగ్య వ్యవస్థ, స్త్రీ- గర్భిణీ- ప్రసవ వ్యవస్థ లేని రోజుల్లో మంత్రసానుల చేత ప్రసవం వల్ల శిశువులు ప్రతి వంద ప్రసవాల్లో సుమారు 50 శిశువులు ప్రసవ సమయంలోనే కాలం చేసేవారు. ఎన్నో అంటువ్యాధుల్నుంచి మానవాళిని పరిరక్షించిన టీకాలు, వ్యాధి నిర్థారణ, నివారణ, శస్త్రచికిత్స పద్ధతులు రావడంవల్ల మానవుడు ఈ రోజు 70 సంవత్సరాల వరకు జీవించగలుగుతున్నాడంటే అందుకు కారణం ప్రాచీన పరిజ్ఞానం కాదు. ఆధునిక విజ్ఞానమే కారణం. అంతేకాదు పాదార్థిక పరిజ్ఞానం బోధపడింది. ఇన్ని రకాల పదార్థాలెందుకున్నాయి? ఎలా ఉన్నాయి? జీవం అంటే అర్థం ఏమిటి? మనుషులెలా పుడతారు? జీవకణంలో ఏమున్నాయి? భూమిపై ఇన్ని రకాల జీవులెలా ఆవిర్భవించాయి? వర్షాలు ఎపుడొస్తాయి? తుఫానులు ఎపుడొస్తాయి? సముద్రాల్లోంచి పెట్రోలియం ఉత్పత్తుల్ని ఎలా సాధించాలి? సుముద్రాల లోతెంత? పర్వతాల ఎత్తు ఎంత? ఆకాశంలో ఏముంది? తోక చుక్కలు, ఉల్కలు, విన్యాసాలు వంటి ఖగోళ సంబంధ సంఘటనలు ఎందుకు, ఎపుడు, ఎలా ఏర్పడతాయి? విశ్వాంతరాళాల రహస్యాలు ఏమిటి? భూమ్మీదతో పాటు మరో గ్రహాలపైన ఎక్కడ జీవం ఉంది? అసలు మరెక్కడైనా జీవం ఉందా? అణువులు, పరమాణువులు, ప్రాథమిక కణాలు, క్వార్కులు, లెప్టానులు, బోసానుల స్థాయి నుంచి తారామండలాలు, నెబ్యులాలు, గురుత్వ తరంగాలు, విద్యుత్తరంగాలు వంటి ఎన్నో వాస్తవాలు తెలుసుకోవడంలో ఆధునిక విజ్ఞానం విజయం సాధించింది.
సంస్కృతి అంటే ఏమిటి? అది కేవలం వర్గ ధోరణి ఉన్న అంశం. ఎవరి సంస్కృతి? గ్రామీణ సంస్కృతి, శ్రామికుల సంస్కృతి, పాలకవర్గాల సంస్కృతి, దోపిడీ వర్గాల సంస్కృతి, రాచరిక సంస్కృతి, భూస్వామ్య సంస్కృతి, ఇలా రకరకాల సంస్కృతులు ఉన్నాయి. భారతదేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగాను సంస్కృతులు ఒకే తీరుగా లేవు. కానీ అధునిక విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం సంస్కృతులతో ప్రమేయం లేకుండా సార్వత్రికంగా ఒకే నియమ నిబంధనలతో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రాచీన సంస్కృతి లో ఆరోగ్యకర ధోరణుల కన్నా వివక్షతతో కూడుకున్న అశాస్త్రీయ ధోరణులు ఎక్కువ. స్త్రీల పట్ల వివక్షత, అణగారిన కులాల పట్ల చిన్నచూపు, ప్రకృతి దృగ్విషయాల పట్ల నిర్హేతుక వివరణలు ఎక్కువ.
అలాగని ప్రాచీన సంస్కృతుల్లో సార్వత్రికత లేదనిగానీ, ఆమోదిత అంశాలు ఏ కోశానా లేవనీ కాదు. అటువంటి సదాచారాల్ని, మానవీయ కోణాల్ని మానవ చరిత్ర తనలో ఇముడ్చుకొంటూ ముందుకెళుతోంది. అనాచారాల్ని వదిలేయమంటోంది. ఆడవాళ్లు, మగవాళ్ల కంటే ఏమీ తీసిపోరనీ, ఎందులోనూ అబలలు కాదని ఘోషిస్తోంది. కుల, మత వైషమ్యాల్లో అర్థం లేదంటోంది. భర్త చనిపోతే భార్యలు కూడా చనిపోవాలనడం, రుతుస్రావం అంటే మైల పడడంగా ఆపాదించడం అనాగరికత అంటోంది. దళితులు పంచమ వర్ణాలని, చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం మనుషులు పుట్టారనడం అమానుషం అంటోంది.
పర్యావరణ కాలుష్యానికి కారణం ఆధునిక విజ్ఞానం కాదు. ఆధునిక సాంకేతికత కాదు. ఆధునిక విజ్ఞాన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం లాభాలకు శ్రామిక శ్రమశక్తి దోపిడీకి మాత్రమే వాడుకుంటూ అవే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెలిబుచ్చిన పర్యావరణ పరిరక్షణ పద్ధతుల్ని పాటించని పాలకవర్గాలు, పెట్టుబడిదారుల కపట పాలసీలు, పద్ధతులే కాలుష్య కారకాలనీ తెలుసుకోవాలి.
Copying
Metikala Srinivasarao
Sri Sree Ram Agency
Jaggayyapet