13/11/2025
Shared with Your friends
ఒక (మా) బామ్మ కథ
(A human species ... now extinct)
నేను పుట్టిన తరువాత మెల్ల మెల్లగా నా చుట్టూ ఉండే వ్యక్తులు నాకు తెలుస్తున్నారు.
అమ్మ, నాన్న, అన్న, అక్క .బామ్మ కూడా.
మా బామ్మ మాత్రం వేరే విధం గా ఉండేది.
నన్ను ఎత్తు కునేది. పలకరించేది. కానీ మనిషి మాత్రం విలక్షణంగా ఉండేది
నేను పెరుగుతూ ఉంటే నాకూ తేడాలు తెలుస్తున్నయ్.
1960 వ దశకం.
భారత దేశం చైనా భూతం శీర్షిక న యుద్ధ వార్తలు, వేంకటేశ్వర సుప్రభాతం, భక్తిరంజని లవకుశ పాటలు, ఘంటసాల భక్తి గీతాలు ఇవి ఆకాశ వాణి తో ఉన్న అనుబంధం. ప్రభ వీక్లీ లో చిట్టిబాబు కార్టూన్, ఆటలు, పాటలు.
పక్క ఇంటి ముందర కోళ్లని తరుముతూ ఉంటే ఎంత ఆనందము!
బడి కి టైమ్ అవుతోంది తొందరగా తయారవు అంటూ మా బామ్మ ఇచ్చే రిమైండర్ ఎంతో డిస్టర్బింగ్ గా ఉండేది.
సరే అని పలక తీసుకుని వీధి చివరికి బడికి ఒక్క
దూకు లో చేరుకున్నాను. ఒరే చొక్కా వేసుకో లేదురా అంటూ తరుము కొచ్చింది మా బామ్మ.
తెల్లటి చీర, చీరె అనాలో ధోతీ అనాలో తెలియని వస్త్రం ధరిస్తుంది. ఒకే ఒక వస్త్రం. దాన్ని గుండు మీదుగా తిప్పి చెవుల మధ్యలో దోపు కొంటుంది
ఏక వస్త్రధారి. రవిక వేసుకోదు. ఇదీ విధవరాలి యొక్క గౌరవ ప్రదమైన ఏక వస్త్ర ధారణ. నెలకు ఒక సారి కేశముండనం చేయించుకుంటుంది.
ఆమె ప్రతి దినం అందరి కంటే మందు గానే నిద్ర లేచి ఇంటి పనులు మొదలు పెట్టేది.
స్నానం ముగించుకుని, (ఏ కాల మైన చన్నీళ్ళే) పై దణ్ణెం మీద క్రితం రోజు ఆరేసినా మడి పంచె కట్టుకుని, ను దుటన విభూతి పెట్టుకుని, పూజ చేసుకునేది. రుద్రాక్ష మాల తిప్పు కుంటూ జపం చేసుకునేది.
అమ్మ, అక్క నుదుటన కుంకుమ ధరిస్తె మా బామ్మ మాత్రం విభూతి పెట్టుకుంటుంది.
ఆమె అందరిలో చాలా ప్రత్యేకం గా కని పించేది.
చాలా రోజులు ఒక సందేహం నన్ను వేధించేది.
బామ్మ ఎందుకు అలా ఉంటుంది? అసలు బామ్మ ఎవరు? మగా? లేక ఆడ?
ఆమె స్త్రీ అని తెలియడానికి నాకూ చాలా రోజులు పట్టింది.
నుదుటి పైన కుంకుమ బొట్టు, కాశా బోశ రీతి లో రంగు చీరె కట్టు కుని, చెవి దిద్దులూ, మెడలో నగలు మంగళసూత్రం, ముఖంమీద చిరు నవ్వుతో మెరిసే మా అమ్మమ్మ కీ, బామ్మ కీ యెంత వ్యత్యాసం!!!
చాలా సంవత్సరాల తర్వాత నాకు అర్థమైనది ఏమిటంటే, బామ్మ తాను స్త్రీ అన్న విషయాన్ని తానే మరచి పోయింది. ఆమెలో కోమలత ఇగిరి పోయింది.
మా లోనే ఉంటుంది కానీ మాకు చెందిన వ్యక్తి కాదు అనిపిస్తుంది. ఆమె భోజనం వేరు. పడక వేరు. దుస్తులు వేరు. రాత్రి వేళ 'బామ్మ పిండి' వండుకుని తింటుంది.
ఇంట్లో పూజలు, వ్రతాలు, పేరంటాలు జరుగుతుంటాయిన్నాయి కానీ ఆమె మాత్రం విడిగా కూర్చుని చూస్తూ ఉండేది. ఆమె ఒక అభాగ్య దేవత.
నేను పెరుగుతుంటే ఆమె గుండు మీది జుట్టు క్రమంగా తెల్ల బడసాగింది. ముఖం మెల్ల మెల్లగా వడిలి పోతూ వుండేది.
అప్పుడు నాకు చెప్పడం తెలీదు కానీ, ఆమె ముఖం లో విషాదం కన పడేది. తన దౌర్భాగ్యాన్ని లోలోపల సహించేది. ఇతరులంటే లోలోపల దాగిన అసూయ ద్వేషం అప్పుడప్పుడూ కనపడుతూ ఉండేది.
పర్వ దినాలలో తెల్లవారు జాము నే లేచి కృష్ణా స్నానానికి వెళ్ళేది. 4 గంటల సమయం లో లేచి బయటకు రాగానే, ఆమెతో మరో నలుగురు బామ్మలు కలిసే వారు. అందరూ భజన చేసుకుంటా నడిచేవారు.
"కృష్ణ స్నానికి పోదామా మనసా మనము"
"రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహార రణ ధీర"
ఇలా వెళ్ళి కృష్ణ లో స్నానమాచరించి అంగట్లో కూరలు, మాకోసం జామ కాయలు కొనుక్కొని వచ్చేది.
అప్పుడప్పుడు దుర్గ గుడికి కొత్త గుళ్ళ కి వెళ్ళి వచ్చేది. రామ కోటి ఉత్సవాలకు కూడా వెళ్లి భాష్యం, ప్రవచనం వినేది
మా బామ్మ కి మా నాన్న ఒక్కడే కొడుకు. రాముడికి
ఎన్నో పూజలు భజనలు చేస్తే పుట్టిన గారాబాల కొడుకు. రాముడు అని పేరు పెట్టుకున్నారు.
"రాముడూద్భవించి నాడు రఘు కులమ్మునా"
" పాహి రామ ప్రభో"
అంటూ బామ్మ పాటలు బాగా పాడేది.
ఆమె పుట్టిల్లు వైకుంఠపురం. మా నాన్నగారు పుట్టిన ఊరు కూడా అదే. మా బామ్మ ఆ ఊరు విశేషాలు చెబుతూ ఉండేది.
వాసిరెడ్డి వెంకటరత్నం నాయుడు గారి గురించి చెబుతూ ఉండేది
వారు గొప్ప శివ భక్తులనీ చెబుతారు
వారు కట్టించిన అమరావతి గుడి చరిత్ర చెప్పేది
మా బామ్మ వలన మాకు అందరికీ వైకుంఠపురం అమరావతి కృష్ణా నదీ దుర్గ గుడికి కొత్త గుళ్ళకీ పాత శివాలయం, సత్య నారాయణ పురం, కృష్ణ లంక లాటి వాటితో మాకు ఆధ్యాత్మిక మైన, ఆత్మీయ మైన బంధం ఏర్పడింది.
మా చిన్న అమ్మమ్మ సాక్షాత్తు లక్ష్మీ దేవి లాగా ఉండేది. మా అందరికీ చాలా ఇష్టం. తరచుగా వెళుతూ ఉండే వారము. ఒక రోజు 1965 లో కావచ్చు, హఠాత్తుగా చిన్న తాత గారు కాలం చేశారు. ఆ రోజు మా చిన్న అమ్మమ్మని ఆఖరి సారిగా చూశాను. 10 వ రోజున చిన్న అమ్మమ్మ కనిపించలేదు. ఒక అభాగ్య దేవత కూర్చుని ఉంది. ఇల్లంతా తిరిగి వెతుక్కున్నాను. చిన్న అమ్మమ్మ కనిపించలేదు.
తరువాత గుండు బామ్మల జాబితా లోకి మరి కొందరు చేరారు.
మా బామ్మ వంట.
ముక్కల పులుసు రాచి ప్ప లో కాచటం మా బామ్మ ప్రత్యేకత.
' ఒరే రాముడు, మీ నాన్న తిధి దగ్గర పడింది. ఏర్పాట్లు చెయ్యాలి చూడరా '
ఆ రోజు మడి గట్టు కుని గారెల పప్పు రుబ్బు తుంది. కచ్చ పచ్చా గా రుబ్బి, మిర్చి అల్లం వేసిన గారె లంటే మా తాతకు ఎంతో ప్రీతి అట.
అతి విషాద కార మైన ఆ వేష ధారణ ఉంటేనే భర్త తిధి నాడు వంట చేసే అధికారం లభిస్తుందట. అందుకనే, విషాదాన్ని దిగ మింగి ఆ వేషాన్ని వితంతువులు అంగీకరించారు.
భోక్తల భోజనం అయేక నక నక లాడే కడుపు తో గారెలు తింటూ ఉంటే స్వర్గం కన పడేది. అల్లం పచ్చడి, నవ్వుల పొడి అద్దు కోవాలి .
బామ్మ ఒక 30 40 మంది కి అవలీలగా వంట చేసేది. కళాయి పెట్టిన ఇత్తడి పాత్రలూ, రాచ్చిప్పలూ ఉపయోగించేది. కట్టెల పొయ్యిలో నిప్పు రాజేసి, గొట్టంతో గాలి ఊదు వంట చేసేది
బామ్మకి స్నేహితురాళ్ళు ఒక పది మంది సమ వయస్కులు ఉండేవారు. అందరూ గుండు బామ్మలే.
అప్పుడప్పుడు వాళ్లు మా ఇంటి కి వచ్చే వాళ్లు. వాళ్ల బాతాఖానీలో అనేక వివిధ విషయాలు, చైనా వాడితో యుద్ధం, శాస్త్రి గారి సోమవారపు ఉపవాస వ్రతం (తిండి గింజల ఉత్పత్తి తక్కువ గా ఉన్నందున శాస్త్రిగారు ఆ పిలుపునిచ్చారు), రామ కోటి ఉత్సవాలు, బ్రహ్మంగారి జోస్యం, వెధవ ముండ రాజ్యమేలటం, మగాళ్ళ కి షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటి టాపిక్సు ఉండేవి.
వారందరూ కూడా మా బామ్మ లాగే వారి స్త్రీత్వాన్ని మరిచి పోయిన వారే.
ఒక రోజు బామ్మ మా నాన్నగారితో 'ఒరే రాముడూ, బృందావనం వెళతానురా. అందరూ వెళుతన్నారు' అంది.
మనాన్నగారు చికాకు పడి ' బృందావనం మీకెందుకులే, అనవసరపు ఖర్చు, ఏమ్ వద్దులే' అన్నారు.
నాకూ తరువాత తెలిసినది ఏమిటి అంటే, ఒక పుణ్య దినాన వేల మంది విధవలు రాత్రి అంతా మేలుకొని కృష్ణ భజన చేస్తారట బృందావనంలో. ఎందుకు అంటే ఏ జన్మలో కూడా వైధవ్యం ప్రాప్తించ కూడదనే కోరికతో.
వైధవ్యం ఎంత దుర్భరమో తెలుస్తోంది.
మా నాన్న గారి బంధువు ఒకావిడ 'బ్యూటిఫుల్ యంగ్ విడో ' మా ఇంటికి సుడి గాలిలా 'ఏరా రాముడూ' అంటూ వచ్చేది. ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడేది. గుండు మీది వత్తుగా నల్లగా కొద్దిగా పెరిగిన జుట్టునీ, ధృడమైన వక్షోజాలనీ, తెల్లని పలచని పంచె దాచలేక పొయ్యేది. ఆమె తను కూడా యథా విధిగా తన స్త్రీత్వాన్ని విసర్జించింది.
మా కుటుంబాల్లో ఇంకొందరు గుండు బామ్మలు జాబితాలో చేరారు.
1965 లో అనుకుంటాను.
బామ్మ స్నేహితు రాళ్లు అందరూ కాశీ యాత్ర కు పూను కున్నారు. అందరూ మా ఇంట్లో సాయం కాలంలో మీటింగ్ లు పెట్టు కునేవాళ్లు. అన్నీ వివరంగా చర్చించు కునేవారు. తీసుకుపోవలసిన వస్తువుల జాబితా తయారు చేశారు
కచ్చిక, తాటాకులు, చెంబులు వంట పాత్రలు బొగ్గులు, కుంపట్లూ, బియ్యం, పప్పులు, కత్తి పీట, పూజా సామాన్లు, దేవతార్చన, ఇంకా ఎన్నో.
హడావిడి పడుతూ ఏర్పాట్లు చేసు కుంటు వుంటే చూసి మా నాన్న గారు నవ్వ సాగారు.
మేము ఏమిటన్నట్టుగా చూశాము. ఆయనకు తన అలమరలో నుండి మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు 1924 లో రచించిన ' బారిష్టరు పార్వతీశం' అనే నవల తీసి మాకు ఇచ్చారు. ఇంటిల్లిపాది అది చదివి ఎంతో నవ్వు కున్నారు
ఒక ఏజెంట్ సాయంతో అన్నీ ఏర్పాట్లు అయినయ్. ఒక 10 రోజుల్లో ప్రోగ్రాం.
మనమలు అందరం సమాన్లు ప్యాక్ చేశాము.
బామ్మలందరు నిరక్షరాస్యులే !!!
ప్రయాణం రోజు రానే వచ్చింది.
సామాన్లు స్టేషన్ కు చేర్చి, బామ్మలను అందరినీ ట్రైన్ ఎక్కించి టాటా చెప్పాము.
జిటి ఎక్స్ప్రెస్ లో ప్రయాణం. కానీ నాగపూరు లో మజిలీ చేసి బండి మారాలి.
యేనుగుల వీరా స్వామి గారి అనుభవం లాగే కాశీ యాత్ర అంచెలు అంచెలుగా సాగింది.
బామ్మ లు అందరూ స్టేషన్ ప్లాట్ఫాముల మీద మడి కట్టు కుని నిత్య పూజలు కానిచ్చి, వంటలు కూడా చేసుకుంటారు. కానీ ఎమైందంటే ఉప్పు తేవటం మర్చి పోయారు. బయటకు ఊర్లోకి వెళ్లి అంగడిలో అడగాలంటే ఎవరికీ భాష రాదు
ఏజెంటు ఒక విచిత్ర వ్యక్తి. అవసరానికి కనబడడు.
వారిలో ఒక సాహస వంతు రాలు బయటకు వెళ్ళి దుకాణ దారుడి కి చూపించి దాని పేరు తెలుసు కుంది. నమక్. ఆమె మొత్తం బృందానికి నమక్ అనే పదం నేర్పింది.
తరువాతి ప్రయాణం సాగించి కాశీ చేరారు. సత్రం లో దిగారు.
రోజు ఉదయాన్నే భగవత్ దర్శనం, వంటలు వండు కోవటం తినడం. సాయం కాలం గుడులు, మిగిలిన సత్కాలక్షేపం.
నెల రోజులు గడిచి పోయినయ్. తెచ్చుకున్న డబ్బు గూడ అయిపోతోంది
బామ్మలు అందరూ తిరుగు ప్రయాణం ఆరంభించారు
విజయవాడ వచ్చినాక బామ్మ ల కాశీయాత్ర చరిత్రము బంధుమిత్రులలో ఒక విచిత్రమైన చర్చనీయాంశం గా మారింది.
ఇక పోతే కాశీ సమారాధన, కాల భైరవ పూజ పెద్ద ఎత్తున చేసి మా నాన్న గారు మా బామ్మ ని తృప్తి పరిచారు. ఒక వీధి కుక్కని కూడా షోడశోపచాలతో సత్కరించారు
1968
కొంత కాలం బాగానే ఉన్నది. ఒక రోజు ' కళ్లు మసక లు వేసినైరా రాముడు ' అన్నది.
చూపించి శుక్లాలు తీయించాము. కృత్రిమ కటకం అమర్చటం ఆ రోజులలో లేదు. ఆమెకి అనారోగ్య కష్టాలు మొదలు అయినయ్.
1984 లో కావచ్చు.
మా బామ్మ మరణించింది.
అమె జీవించి ఉండగా మేము ప్రేమించామని చెప్ప లేను. కానీ, చని పోయాక మాత్రం నాకు చాలా జ్ఞాపకం వచ్చేది
ఆమె గురజాడ అప్పా రావు గారి బుచ్చమ్మ కాదు, శరత్ బాబు బడి దీదీ కాదు. గణపతి తల్లీ కాదు.
ఎవరూ చూడని, సర్వ సాధారణమైన, ఆనాటికి అనుపమానమైన ఒక బ్రాహ్మణ వితంతువు.
ఆమె మరణంతో గుండు బామ్మ ల జాతి అంతరించి పోయింది అనుకొన్నాను.
కానీ, 1991 లో మా ఇంటి పక్కన ఉన్న అమ్మమ్మ గారి ఇంటికి వాళ్ల ఊరు నుండి వాళ్ల అమ్మ గారు దిగుమతి అయ్యారు. ఆమెని చూసి హతాశుడి నయ్యాను. గుండు విధవ !
ఈనాడు కేశ ముండనం చేసే ఆచారం పోయింది, కానీ
భర్త చనిపోయిన భార్య రూపంమార్చి విధవరాలనే ముద్ర వెయ్యటం కొనసాగుతూనే ఉండటం సబబేనా?